'డిప్యూటీ సీఎం'గా కేటీఆర్!?
(పీపుల్స్ ఆవాజ్ - హైదరాబాద్ ) : త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును డిప్యూటీ సీఎం గా నియమించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. రెండో దఫా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత పరిపాలనలో వేగం మందగించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు, పథకాలకు భారీగా ఆర్ధిక వనరుల అవసరం ఉండగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. ఇటీవల సీఎం కేసీఆర్ పొదుపు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కేబినేట్ లో కేటీఆర్ ఉండాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కేటీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కేటీఆర్ ను సీఎంగా చూడాలనుకుంటున్న వాళ్ల కోరిక ఇప్పట్లో నెరవేరేలా లేకపోవడంతో కేటీఆర్ ను వచ్చే మంత్రివర్గ విస్తరణలో 'డిప్యూటీ సీఎం'గా కేసీఆర్ ప్రమోట్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని రాజకీయ, మీడియా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పక్క రాష్ట్రంలో పరిపాలన వేగం పుంజుకుంటుండగా తెలంగాణలో పనుల్లో వేగం మందగించడం, మంత్రులకు తగిన స్వేచ్ఛ లేకపోవడం, అభివృధి పనులకు సత్వర నిధుల కేటాయింపు లేకపోవడం తదితర కారణాల వల్ల కేటీఆర్ మంత్రివర్గంలో ఉండాలని సీఎం అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, పార్టీలోనూ జరుగుతున్న అంతర్గత పోరు వంటి అంశాలపై కేసీఆర్ అసహనంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను సీఎంగా చేసే అవకాశాలు, పరిస్థితులు లేకపోవడంతో డిప్యూటీ సీఎంను చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సీనియర్ నేతలు తెలిపారు.