తెలంగాణపై దూకుడు పెంచిన బీజేపీ!
(పీపుల్స్ ఆవాజ్, హైదరాబాద్) : కేంద్రంలో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ లో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన కార్యాచరణ ప్రణాళికను వేగంగా అమలు చేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ రెండోసారి సీఎమ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. పరిపాలనలో ఆశించిన వేగాన్ని పెంచలేకపోతున్నారు. ఒకవైపు పెరిగిన అప్పుల భారం, మరోవైపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
షాకిచ్చిన రాష్ట్రపతి :
కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ షాకిచ్చారు. పరీక్షల్లో జరిగిన తప్పిదాల కారణంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడంపై స్పందించిన రాష్ట్రపతి, ఇప్పుడు దానిపై నివేదిక కోరారు. తెలంగాణ ఇంటర్మిడియెట్ బోర్డు తప్పిదాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్రపతి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు ఆదేశాలు అందాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సహా మరికొందరు దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ''తక్షణం వాస్తవాలతో కూడిన నివేదికను అందచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం" అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
ఏప్రిల్ నెలలో విడుదల చేసిన ఇంటర్మీడియెట్ ఫలితాలలో తప్పులు దొర్లాయని బోర్డు అధికారులే గతంలో అంగీకరించిన విషయం తెలిసిందే. "ఫలితాలు వెల్లడించడంలో తప్పులు దొర్లాయి. సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉండడంతో సమస్యలు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బంబ్లింగ్ సరిగా జరగలేదు. కొందరికి ప్రాక్టికల్ మార్కులు నమోదు కాలేదు. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రాల్లో మార్పు వల్ల కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయి. జంబ్లింగ్ లో కూడా కొన్ని తప్పులు జరిగాయి. సాఫ్ట్ వేర్ లోపంతో కోడింగ్ - డీకోడింగ్ లో కొంత సమస్య తలెత్తింది. బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం" అని అప్పట్లో విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఫెయిలైన వారందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్ - రీకౌంటింగ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హామీనిచ్చారు.
రాష్ట్రపతియే ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందంటే బీజేపీ దూకుడును తెలంగాణాలో ఆపడం కష్టమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా, బహిర్గతంగా తీసుకుంటున్న చర్యలు బీజేేేపీ రాష్ట్ర కేేేేడర్ లో కొత్త ఉత్సాహం నింపుతున్నయి.