మెట్రో దుర్ఘటనలో మౌనిక మృతిపై సర్వత్రా ఆగ్రహం!

#మౌనిక_మరణం


మెట్రో దుర్గటనపై సర్వత్రా ఆగ్రహం!


(పీపుల్స్ ఆవాజ్, హైదరాబాద్ ) : అమీర్ పేట మెట్రో రైల్ స్టేషన్ లో  పెచ్చులూడి మీదపడటంతో మౌనిక అన్యాయంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు మెట్రో ఎండీపై, ఎల్ అండ్ టీ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


* ఎల్ అండ్ టీ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి : టీఏపీఎమ్ కన్వీనర్ భారత సుదర్శన్ 


అమీర్ పేట 'మెట్రో స్టేషన్'లో మరణించిన మౌనిక కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల నష్ట పరిహారం, కుటుంబసభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ప్రజా ఉద్యమాల వేదిక రాష్ట్ర కన్వీనర్ భారత సుదర్శన్ డిమాండ్ చేశారు. మెట్రో ఎండీ మరియు ఎల్ అండ్ టీ సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. 


* మౌనికది ముమ్మాటికీ మెట్రో, ప్రభుత్వ హత్యే: కోదండరామ్‌


అమీర్‌పేటలో మెట్రో స్టేషన్‌ దగ్గర చనిపోయిన మౌనిక కుటుంబసభ్యులను కోదండరామ్‌, సీపీఐ నేతలు పరామర్శించారు. మౌనికది ముమ్మాటికీ మెట్రో, ప్రభుత్వ హత్యేనని కోదండరామ్‌ పేర్కొన్నారు. మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి చెందిందన్నారు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.


* ఎల్అండ్‌టీ అధికారులతో, మౌనిక కుటుంబ సభ్యుల చర్చలు


మౌనిక మృతిపై ఎల్అండ్‌టీ అధికారులతో ఆమె కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుపుతున్నారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ డబ్బు మాత్రమే ఇస్తామని ఎల్‌అండ్‌టీ అధికారులు స్పష్టం చేశారు. ఎక్స్‌గ్రేషియా కాకుండా ఇన్సూరెన్స్ విషయం చర్చించడంపై మౌనిక కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.